TRS: ఎంఐఎంకు ఓటేయడం అంటే అభివృద్ధిని అడ్డుకోవడమే: టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రకాష్‌గౌడ్
- మైలార్‌దేవ్ పల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన టీఆర్‌ఎస్ అభ్యర్థి
- కాంగ్రెస్ హయాంలో విద్యుత్ కొరతతో పరిశ్రమలు మూతపడ్డాయని విమర్శ
- 24 గంటలు విద్యుత్ ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని వ్యాఖ్య
రాజేంద్రనగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రకాష్‌గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంకు ఓటు వేయడం అంటే అభివృద్ధిని అడ్డుకోవడమేనని వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి నిలిచిపోతుందని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇటీవలే ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ‘కారులో కూర్చోండి...హాయిగా తిరిగి రండి’ అంటూ పిలుపునిస్తూ ఎంఐఎం పోటీచేయని ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేయాలని కోరిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తనపై ఎంఐఎం అభ్యర్థి పోటీ చేస్తున్నందున ప్రకాష్‌గౌడ్ ఈ విధంగా వ్యాఖ్యానించినట్లు భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ హయాంలో విద్యుత్ కొరతతో పలు పరిశ్రమలు మూతపడ్డాయని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ వచ్చాక 24 గంటలు విద్యుత్ సరఫరాతో పరిశ్రమలు విజయవంతంగా నడుస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.