Chandrababu: నోరు పారేసుకోవడం మోదీ, కేసీఆర్ ల నైజం.. కేసీఆర్ హుందాతనాన్ని మరచి ప్రవర్తిస్తున్నారు: చంద్రబాబు
- హైదరాబాదుకు తొలి అంతర్జాతీయ విమానాన్ని తెచ్చింది కూడా నేనే
- నాలుగున్నరేళ్లలో హైదరాబాదులో ఏం కట్టారో కేసీఆర్ చెప్పాలి
- నోరు పారేసుకోవడం ప్రధాని మోదీ, కేసీఆర్ ల నైజం
రాజకీయాల్లో హుందాతనం ఉండాలని... ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులకు హుందాతనం చాలా అవసరమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుందాతనాన్ని మరచి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. నోరు పారేసుకోవడం ప్రధాని మోదీ, కేసీఆర్ ల నైజమని దుయ్యబట్టారు. హైదరాబాదును అభివృద్ధి చేసింది తానేనని చెప్పారు. 1995లో ఒక విదేశీ విమానం కూడా హైదరాబాదుకు వచ్చేది కాదని... అలాంటి పరిస్థితుల్లో దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమాన సర్వీసులను తానే తీసుకొచ్చానని తెలిపారు. నగరంలో ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తూ... అభివృద్ధి ఆగకుండా చూశానని చెప్పారు. రాజేంద్రనగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాదులో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును నిర్మించానని... అది తన కోసం కట్టుకోలేదని, ప్రజల కోసమే నిర్మించానని చంద్రబాబు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీ, ఐఎస్బీ ఇలాంటివెన్నో తన వల్లే వచ్చాయని చెప్పారు. ఆ తర్వాత అదే అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ కొనసాగించిందని తెలిపారు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో హైదరాబాదులో టీఆర్ఎస్ పార్టీ ఏం కట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాదును చంద్రబాబు కట్టారా? అని కేసీఆర్ అడుగుతున్నారని... తాను హైదరాబాద్ కట్టలేదని, సైబరాబాదును నిర్మించానని చెప్పారు.