India: విడాకులు ఇవ్వలేదని హెచ్ఐవీ రక్తం ఎక్కించిన సైకో డాక్టర్.. పోలీసులను ఆశ్రయించిన భార్య!
- కట్నం కోసం వేధించిన ప్రబుద్ధుడు
- డబ్బులు తీసుకురావడంతో విడాకులకు ఒత్తిడి
- మహారాష్ట్రలోని పూణేలో ఘటన
పెద్దలు కుదర్చిన వివాహం చేసుకున్న ఓ డాక్టర్ సైకోగా మారాడు. తొలుత భార్యను కట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేశాడు. అతను కోరినంత మొత్తాన్ని బాధితురాలు తీసుకుని రావడంతో విడాకులు కావాలని కొత్త పల్లవి అందుకున్నాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో హెచ్ఐవీ రోగుల నుంచి సేకరించిన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా బలవంతంగా ఎక్కించాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకుంది.
పూణే నగరంలోని పింప్రీ చించ్వాద్ లోని పింపుల్ సౌదాగర్ ప్రాంతానికి చెందిన యువతికి ఇక్కడి గ్లోబల్ ఆసుపత్రిలో హోమియో డాక్టర్ గా పనిచేస్తున్న వ్యక్తితో వివాహమయింది. పెళ్లయిన కొత్తల్లో బాగానే ఉన్నప్పటికీ కొద్దిరోజుల తర్వాత ఆ డాక్టర్ తన రాక్షసత్వాన్ని బయటపెట్టాడు. పెళ్లి సందర్భంగా ఇచ్చిన కట్నం సరిపోదనీ, మరింత కట్నం తీసుకురావాలని టార్చర్ పెట్టాడు. దీంతో బాధితురాలు అతను చెప్పిన్నట్లే నగదును తెచ్చి అందజేసింది. దీంతో యువతిని ఇంకా వేధించడానికి విడాకుల పత్రాలు తీసుకొచ్చిన సదరు ప్రబుద్ధుడు సంతకాలు పెట్టాలని కోరాడు. విడాకులు ఇస్తే తాను మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.
అయితే విడాకుల పత్రంపై సంతకాలు పెట్టేందుకు బాధితురాలు నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన సదరు డాక్టర్, హెచ్ఐవీ రక్తాన్ని ఆమెకు ఇంజెక్షన్ ద్వారా ఎక్కించాడు. దీంతో తీవ్ర ఆందోళనకు లోనైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో యువతి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సైకో భర్తపై ఐపీసీ 498ఏ, 323, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.