Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి మరో సంచలన నిర్ణయం.. కంగుతిన్న ప్రజలు
- మార్చి వరకూ వివాహాలు రద్దు
- కుంభమేళా కారణంగా యోగి ఆదేశం
- గంగానదిలో ఆరు రకాల స్నానాలు
- 15 నుంచి తోళ్ల పరిశ్రమల మూసివేత
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి వరకూ ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్)లో పెళ్లిళ్లనేవే జరగకూడదని కఠినమైన ఆదేశాలు జారీ చేయడంతో అక్కడి ప్రజలు కంగుతిన్నారు. ఈ సమయంలో జరగనున్న కుంభమేళాను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. కుంభమేళాకు లక్షల్లో భక్తులు అలహాబాద్‌కు తరలివస్తారు. వారి కోసం ఫంక్షన్ హాళ్లు, అతిథి గృహాల్లో బస ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీని కోసం పెళ్లి వేడుకలన్నీ రద్దు చేసినట్టు సమాచారం.
అయితే ఇప్పటికే తమ ఇంట్లో వివాహం కోసం ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలు బుక్ చేసుకున్న ప్రయాగ్‌రాజ్ వాసులు ఈ వార్త విని షాక్ అయ్యారు. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఫంక్షన్ హాళ్ల యజమానులు, క్యాటరింగ్ చేసే వాళ్లు ఈ ఆదేశాల నేపథ్యంలో ఆవేదన చెందుతున్నారు. మరోవైపు కుంభమేళా కోసం వచ్చే భక్తులు గంగానదిలో ఆరు రకాల స్నానాలు ఆచరిస్తారు. దీనికోసం గంగానదిని పరిశుభ్రంగా ఉంచేందుకు గాను.. వచ్చే ఏడాది డిసెంబర్ 15 నుంచి మార్చి 15 వరకూ తోళ్ల పరిశ్రమలన్నీ మూసివేయాలని యోగి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.