Telangana: 'బాహుబలి'ని గుర్తు చేస్తూ... ప్రత్యర్థులపై బాలకృష్ణ విసుర్లు!
- మహాకూటమి తరఫు అభ్యర్థులకు ప్రచారం
- రాజు భల్లాలదేవుడే అయినా, గుర్తుండేది బాహుబలే
- బాబు కట్టిన భవంతుల్లో ఉంటూ ఆయనపైనే విమర్శలా
- నందమూరి బాలకృష్ణ ఎద్దేవా
తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి తరఫు అభ్యర్థుల కోసం ప్రచారబరిలోకి దిగిన నందమూరి బాలయ్య, తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో 'బాహుబలి' చిత్రాన్ని గుర్తుచేస్తూ, "సినిమాలో రాజు... భల్లాలదేవుడే అయినా.. ప్రజలందరూ బాహుబలినే గుర్తు పెట్టుకున్నారు" అని అన్నారు.
'చంద్రబాబు కట్టిన భవంతుల్లో సమావేశాలు పెట్టుకుంటున్న కేసీఆర్, ఆయన్నే విమర్శిస్తున్నారు. సైబరాబాద్ సృష్టికర్త చంద్రబాబే. టీడీపీ ఓ కులానికి చెందిన పార్టీ కాదు. తెలుగు ప్రజలను ఆదుకునేది టీడీపీయే. కేంద్ర ప్రభుత్వంతో కేసీఆర్ ఓ అవగాహన పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీని మోసం చేసిన వాళ్లు ఇప్పుడు మీ ముందున్నారు. వారికి బుద్ధి చెప్పాలి' అంటూ పిలుపునిచ్చారు.
తెలుగుదేశం పార్టీకి ఉన్నంతమంది కార్యకర్తలు మరే పార్టీకీ లేరని చెప్పారు. సనత్ నగర్ లో పర్యటించిన ఆయన, గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై పోటీ చేసి గెలిచి, ఆపై టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రస్తావించకుండా, ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.