Narendra Modi: నా అంతు మోదీనే చూడలేకపోయారు, ఇక, వీళ్లు చూస్తారట!: సీఎం చంద్రబాబు
- కేటీఆర్ నా అంతు చూస్తానంటున్నారు!
- నలభై ఏళ్లలో నన్నెవరూ ఏం చేయలేకపోయారు
- ఇక, మీరేం చేయగలుగుతారు?
'నా అంతు మోదీనే చూడలేకపోయారు, ఇక, వీళ్లు చూస్తారట' అంటూ టీఆర్ఎస్ నేత కేటీఆర్ పై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో ని చైతన్యపురిలో నిర్వహిస్తున్న రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, కేటీఆర్ తన అంతు చూస్తానంటున్నారని, నలభై ఏళ్లలో తనను ఎవ్వరూ ఏం చేయలేకపోయారని, నరేంద్ర మోదీ వల్లనే కాలేదు, ఇక, మీరేం చేయగలుగుతారని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యంలో సహనం ఉండాలని, ప్రజలకు సేవ చేయాలన్న బాధ్యత ఉండాలని, ఈ నాయకులకు ఇది లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ విధానాల వల్ల ధనిక తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అన్నారు. ఈ సందర్భంగా ఎంఐఎం గురించి ప్రస్తావిస్తూ, ప్రజలను మోసం చేయడంలో ఈ పార్టీ దిట్ట అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోదీపైనా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి మేలు చేస్తారని నరేంద్ర మోదీని ప్రజలు గెలిపిస్తే, నట్టేట ముంచేశారని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని విమర్శించారు. బ్యాంకుల్లో, ఏటీఎంలలో డబ్బు ఉండట్లేదని, ‘పెట్రో’ ధరలు, నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయని అన్నారు. మోదీని నిలదీస్తే ఐటీ దాడులు చేయిస్తారని, మోదీ హయాంలో సీబీఐ భ్రష్టు పట్టిపోయిందని విమర్శించారు.