North Indians: ఉత్తర భారతదేశ ప్రజలకు ఆత్మాభిమానం లేదు: రాజ్ థాకరే తీవ్ర వ్యాఖ్యలు
- ప్రధానుల్లో ఎక్కువమంది నార్త్ ఇండియన్లే
- అయినప్పటికీ ఆ రాష్ట్రాల్లో వెనుకబాటే
- నేతలను యువత ప్రశ్నించాలి
ఉత్తర భారతదేశ ప్రజలకు ఆత్మాభిమానం ఏ కోశానా లేదని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ముంబైలో ఉత్తర భారతీయులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, తొలిసారి ఆయన హిందీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తమ రాష్ట్రాల్లో ఉద్యోగ, ఉపాధి కల్పన ఎందుకు జరగడం లేదో మంత్రులను నిలదీయాలని సూచించారు.
‘‘చాలా రాష్ట్రాల్లోని యువత అవమానానికి గురవుతోంది. మీకసలు ఆత్మాభిమానమే లేదు. మీ రాష్ట్రాల్లోని నేతలను, మంత్రులను మీరెందుకు ప్రశ్నించడం లేదు’’ అని రాజ్‌థాకరే ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఎందరో ప్రధానులను దేశానికి అందించాయని, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ కూడా అక్కడి వారేనని పేర్కొన్నారు(మోదీ యూపీలోని వారణాసి స్థానం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు). అయినప్పటికీ ఆయా రాష్ట్రాలు పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎందుకు వెనుకబడి ఉన్నాయో, ఉద్యోగాల కల్పన ఎందుకు జరగడం లేదో నిలదీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ముంబైలో నివసిస్తున్న ఉత్తర భారతదేశ ప్రజలంటే ఇష్టపడని రాజ్‌థాకరే ఇప్పుడు ఏకంగా హిందీలో వారితో మాట్లాడడం సంచలనమైంది. తాను హిందీ మాట్లాడడంపై ఆయన వివరణ ఇస్తూ.. తాను చెప్పేది వారికి అర్థం కావాలనే హిందీలో మాట్లాడినట్టు చెప్పారు.