KCR: నేను పోరాటయోధుడిని.. ముష్టివాడిని కాదు!: ముఖ్యమంత్రి కేసీఆర్
- కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయం ఏర్పాటుచేస్తాం
- తెలంగాణ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తా
- ఆ తర్వాత దేశమంతా పర్యటిస్తాను
దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లేని ప్రత్యామ్నాయ ఫ్రంట్ కోసం తాను పోరాడుతున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు ఉండే కూటమిలో టీఆర్ఎస్ చేరబోదని స్పష్టం చేశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై తాను టీఎంసీ అధినేత మమతా బెనర్జీ, జేడీఎస్ సీనియర్ నేత దేవెగౌడ, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తో మాట్లాడానని తెలిపారు. వీరంతా తన ఆలోచనతో ఏకీభవించారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ మాట్లాడారు.
ఈసారి తెలంగాణలో భారీ మెజారిటీతో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఓసారి తెలంగాణ ఎన్నికలు పూర్తయ్యాక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం దేశమంతా పర్యటిస్తానని తెలిపారు. తాను పోరాటయోధుడిననీ, ముష్టివాడిని కాదని వ్యాఖ్యానించారు. తాను పోరాడటంతోనే అసాధ్యం అనుకున్న తెలంగాణ సుసాధ్యం అయిందనీ, అలాగే ఫెడరల్ ఫ్రంట్ సైతం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.