depressure: బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం...ఆరో తేదీ నాటికి బలపడే అవకాశం
- ఆగ్నేయంగా హిందూ మహా సముద్రం ప్రాంతాల్లో ద్రోణి
- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- రేపటి నుంచి కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం
బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడుతోంది. ఈనెల ఆరో తేదీ నాటికి ఇది బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం తుపాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం ప్రాంతంలో ప్రస్తుతం అల్ప పీడన ద్రోణి ఏర్పడి స్థిరంగా కొనసాగుతోందని, ఇది మరింత బలపడే అవకాశం ఉందని తెలిపారు.
మరోవైపు దక్షిణ కోస్తాంధ్ర, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడి కొనసాగుతోంది. ఈ కారణంగా కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. కోస్తాంధ్రలోని కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మంగళవారం నుంచే వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. చిత్తూరు, కడప జిల్లాల్లో నాలుగు రోజుల తర్వాత కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.