Balakrishna: రైతురాజ్యం వస్తుందనుకుంటే రాబందుల రాజ్యం వచ్చింది : సినీ నటుడు బాలకృష్ణ
- ఎన్నికల ప్రచారంలో తెలంగాణ యాసతో మాట్లాడి ఆకట్టుకున్న ఎమ్మెల్యే
- ప్రభుత్వం తీరువల్ల వందలాది మంది రైతుల ఆత్మహత్య
- మీ రాజకీయ జీవితం లాటరీ...చంద్రబాబుది హిస్టరీ అని వ్యాఖ్య
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రైతు రాజ్యం వస్తుందని అంతా ఆశిస్తే రాబందుల రాజ్యం వచ్చిందని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోకవర్గంలో రోడ్డు షో నిర్వహించిన ఆయన తెలంగాణ యాస, భాషతో మాట్లాడి సభికుల్లో జోష్ నింపారు. ప్రభుత్వం రైతుల్ని ఇబ్బంది పెట్టడం వల్లే వందలాది మంది ఆత్మహత్య చేసుకున్నారని ధ్వజమెత్తారు. ఎందరో త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో ఉపాధి, ఉద్యోగాల్లేక పలువురు ఆత్మహత్యకు పాల్పడడం ఆవేదన కలిగించే అంశమన్నారు.
‘ల్యాప్‌టాప్ కనిపెట్టింది మీరేనా’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబును వ్యంగ్యంగా విమర్శిస్తున్న వారికి తనదైన శైలిలో జవాబిచ్చారు. చంద్రబాబు రాజకీయ జీవితం హిస్టరీ అయితే మీది లాటరీ అని, రాళ్లగుట్టలతో నిండిన హైదరాబాద్‌ను హైటెక్ సిటీగా అభివృద్ధి చేసిన ఘనత బాబుదని అన్నారు. చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదని, సైబరాబాద్ సృష్టికర్త ముమ్మాటికీ చంద్రబాబేనని కొనియాడారు. టీడీపీ ఒక కులం, మతం కోసం పుట్టిన పార్టీ కాదని, కారుకూతలు కూస్తున్న వారికి ఓటర్లే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.