Telangana: చందూలాల్, పుట్టా మధులను హత్య చేసేందుకు రంగంలోకి మావోలు.. ఒకరి అరెస్ట్!
- ములుగు, మంథని, మణుగూరులో దాడికి ప్లాన్
- రెక్కీ నిర్వహించేందుకు వచ్చి దొరికిపోయిన సభ్యుడు
- టీఆర్ఎస్ నేతలకు భారీ భద్రత కల్పించిన పోలీసులు
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా అధికార టీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకోవాలని మావోలు నిర్ణయించినట్లు తేలింది. ములుగు, మంథని, మణుగూరు ప్రాంతాల్లో టీఆర్ఎస్ నేతలను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. నేతల హత్య కోసం రెక్కీ నిర్వహించేందుకు వచ్చిన మావోయిస్టు యాక్షన్ టీమ్ సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో కొన్నిరోజుల క్రితం టీడీపీ నేతలు కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను పక్కా ప్రణాళికతో మావోయిస్టులు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణలో టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి చందూలాల్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుతో పాటు మరికొందరు టీఆర్ఎస్ నేతలను మట్టుబెట్టాలని మావోలు ప్రణాళిక రచించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
తాజాగా పోలీసులకు దొరికిన యాక్షన్ టీమ్ సభ్యుడు రెక్కీ కోసం వచ్చాడని ఓ ఉన్నతాధికారి తెలిపారు. మిగతా యాక్షన్ టీమ్ సభ్యుల కోసం గాలింపును ముమ్మరం చేశామన్నారు. మావోల హిట్ లిస్టులో ఉన్న నేతలకు అదనపు భద్రతను కల్పిస్తామని పేర్కొన్నారు.