TRS: సాక్షాత్తు ముఖ్యమంత్రి హామీకే దిక్కులేకుండా పోయింది...అందుకే పార్టీని వీడాను: దుబ్బ శ్రీనివాస్
- భ్రమల్లో బతకడం ఇష్టం లేకే ఈ నిర్ణయం
- గుడిసెవాసులకు పక్కా ఇళ్లు ఇస్తామంటేనే టీఆర్ఎస్ లో చేరా
- కేసీఆర్ ఆరు కాలనీలు సందర్శించినా ఒక్క ఇటుకా పడలేదు
అధికార పార్టీలో ఉంటే పేదలకు మేలు జరుగుతుందని, గుడిసె వాసులకు పక్కా ఇళ్లు సమకూరి వారి బతుకులు బాగుపడతాయన్న అభిప్రాయంతోనే నాడు సీపీఎంను వీడి టీఆర్ఎస్లో చేరానని పార్టీ నాయకుడు దుబ్బ శ్రీనివాస్ అన్నారు. అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలకే దిక్కులేకుండా పోవడంతో, ఇక భ్రమల్లో బతకడం ఇష్టం లేకే టీఆర్ఎస్ను వదిలేశానని తెలిపారు.
వరంగల్ పట్టణం 13వ డివిజన్ వివేకానంద కాలనీలో ఎనిమిది గుడిసెవాసుల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గుడిసెవాసులకు మూడు నెలల్లో పట్టాలిచ్చి అభివృద్ధి చేస్తామని ఆ రోజు సీఎం కేసీఆర్ చెప్పారని, సీఎంతోపాటు మంత్రుల మాట కూడా అమలు కాలేదన్నారు.
డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామన్న పాలకులు ఇన్నేళ్లలో తట్టెడు మట్టి, ఒక్క ఇటుక వేసిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ, ప్రభుత్వం కొందరు నాయకులకే పరిమితమైందని, ఈ పరిస్థితుల్లో న్యాయం జరిగే అవకాశం లేదన్న ఉద్దేశంతోనే టీఆర్ఎస్ ను వీడినట్లు తెలిపారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.