Andhra Pradesh: జగన్ పై దాడి కేసు.. ఏపీ, కేంద్రానికి నోటీసులు జారీచేసిన హైకోర్టు!
- విచారణను కేంద్ర సంస్థలకు అప్పగించాలన్న జగన్
- కేంద్రం, ఏపీ స్పందించాలంటూ హైకోర్టు నోటీసులు
- సిట్ విచారణ ను నిలిపివేయాలని కోరిన జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం కేసులో దాఖలైన పిటిషన్లపై ఈ రోజు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జగన్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. కోడికత్తి దాడి ఘటనపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని కోరారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణను నిలిపివేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదన్నారు.
అయితే జగన్ లాయర్ వాదననను ఏపీ ప్రభుత్వ న్యాయవాది ఖండించారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నిష్పాక్షికంగా దర్యాప్తు జరుపుతోందన్నారు.
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. కేంద్రంతో పాటు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. జగన్ పై హత్యాయత్నం కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించే విషయంలో అభిప్రాయాన్ని తెలియజేయాలని నోటీసులో సూచించింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 5కు(ఎల్లుండి)కి వాయిదా వేసింది.