Telangana: గుడ్లగూబల పీకలమీదకి వచ్చిన తెలంగాణ ఎన్నికలు.. ఒక్కో గుడ్లగూబకు రూ.3 లక్షలు!
- అభ్యర్థుల మూఢనమ్మకాలతో గుడ్లగూబలకు పెరిగిన గిరాకీ
- ప్రత్యర్థుల ఇళ్లలో వేస్తే విజయం తథ్యమని నమ్మకం
- ఒక్కో గుడ్లగూబ ధర రూ.3 లక్షలు
అసలే అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్న గుడ్లగూబలకు ఇప్పుడు తెలంగాణ ఎన్నికల రూపంలో మరో ఉపద్రవం వచ్చి పడింది. గుడ్లగూబలను చంపి వాటిని ప్రత్యర్థుల నివాస స్థలాల్లో పడేస్తే ఇక తమ గెలుపును ఎవరూ ఆపలేరని విశ్వసిస్తున్న అభ్యర్థులు ఎంత డబ్బైనా ఇచ్చి కొనుగోలు చేసేందుకు రెడీ అయ్యారు. దీంతో ఒక్కసారిగా వాటికి గిరాకీ ఏర్పడింది. ఒక్కో గుడ్లగూబకు మూడు నుంచి నాలుగు లక్షలు ఇచ్చేందుకు సైతం అభ్యర్థులు ముందుకు వస్తుండడం గమనార్హం.
అభ్యర్థుల నమ్మకాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు గుడ్లగూబల వేటకు బయలుదేరారు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలో గుడ్లగూబల కోసం వేట జోరుగా సాగుతోంది. రెండు రోజుల క్రితం సేడంలో ఆరుగురు వ్యక్తులు గుడ్లగూబలను విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వీటిని విక్రయిస్తున్నట్టు విచారణలో వారు వెల్లడించారు. ఒక్కో దానిని డిమాండ్‌ను బట్టి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలకు విక్రయిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు, మేలు జాతి గుడ్లగూబలకే మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. విషయం తెలిసిన పక్షి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుడ్లగూబలను వేటాడేవారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.