Wall Street: 'మీటూ' అన్నందుకు మహిళల పరిస్థితి మరింత దారుణం... వాల్ స్ట్రీట్ లో ఒంటరవుతున్న యువతి!
- వాల్ స్ట్రీట్ లో పురుష ఉద్యోగుల వివాదాస్పద నిర్ణయాలు
- మహిళలకు సహాయనిరాకరణ
- 'మీటూ' బాధల నుంచి తప్పించుకునేందుకేనట
- పొమ్మనలేక పొగబెడుతున్నారంటున్న మహిళలు
మహిళా ఉద్యోగులతో డిన్నర్ కు వెళ్లవద్దు...
విమానాలు ఎక్కితే వారి పక్కన కూర్చోవద్దు...
హోటల్స్ లో దిగాల్సి వస్తే ఒకే ఫ్లోర్ లో ఉండవద్దు...
ప్రపంచ ఆర్థిక కేంద్రమైన న్యాయరక్ లోని వాల్ స్ట్రీట్ లో తీసుకుంటున్న ఈ వివాదాస్పద నిర్ణయాలు, తమ కాళ్లపై తాము నిలబడాలని భావిస్తున్న యువతులను ఒంటరివాళ్లను చేస్తున్నాయి. వాల్ స్ట్రీట్ లోని పురుషులంతా, 'మీటూ' ఉద్యమం మొదలైన తరువాత ఇలా వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు మహిళల జీవితాలను మరింత కఠినం చేస్తున్నాయి. ఇది కూడా ఓ రకంగా పురుషాధిక్యతను ప్రదర్శించడమేనని మహిళలు ఇప్పుడు వాపోవాల్సిన పరిస్థితి.
ఆఫీసుల్లో మహిళలతో మాట్లాడేవారే కరవయ్యారిప్పుడు. వారి అనుమానాలు తీర్చేందుకు కూడా ఎవరూ ఇష్టపడటం లేదు. ఎక్కడ తమపై ఆరోపణలు వస్తాయన్న భయం కన్నా, ఈ 'మీటూ'ను ఎలాగైనా వదిలించుకోవాలన్న ఉద్దేశమే అందరిలో కనిపిస్తోంది.
ఇటీవల యూఎస్ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్సీ మాట్లాడుతూ, తాను మహిళలతో డిన్నర్ కు వెళ్లడం మానేశానని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇక, 'మీటూ' ఉద్యమంపై పురుషుల స్పందన ఎలావుందో తెలుసుకోవాలని 30 మంది వాల్ స్ట్రీట్ సీనియర్ ఉద్యోగులను ప్రశ్నించగా, ప్రతి ఒక్కరూ మహిళలను దూరం పెట్టాలన్న నిర్ణయంతోనే ఉన్నారు. ఉద్యోగపరంగా చనువుగా మెలగినా, తమపై ఎక్కడ ఆరోపణలు చేస్తారోనన్న ఆందోళన కలుగుతోందని వారు చెప్పడం గమనార్హం.
పురుషులంతా కార్యాలయాల్లో తమ వైఖరిని మార్చుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని మోర్గాన్ స్టాన్లీ మాజీ ఎండీ, ప్రస్తుతం స్వతంత్ర సలహాదారుగా సేవలందిస్తున్న డేవిడ్ భన్ వ్యాఖ్యానించారు. తమను తాము కాపాడుకునేందుకే పురుషులు ఇలా చేస్తున్నారని అంటున్నా, మహిళలను ఒంటరిగా చేయాలన్న పురుషాధిక్యత కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్న పరిస్థితి. ఈ సహాయ నిరాకరణతో కూడా తాము సౌకర్యవంతంగా పని చేయలేకపోతున్నామని మహిళా ఉద్యోగులు వాపోతున్నారు. తమను పొమ్మనలేక పొగబెడుతున్నారని వారు అంటున్నారు.