kcr: కవిత బెడ్రూమ్ లోకి పోలీసులు వెళ్తే ఒప్పుకుంటారా?: కేసీఆర్ కు జైపాల్ రెడ్డి ప్రశ్న
- రేవంత్ ను బెడ్రూమ్ నుంచి దొంగను తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు
- ఇలాంటి దారుణాలు ఎన్నడూ జరగలేదు
- ఓటమి భయంతోనే కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ చరిత్రలో ఇలాంటి దారుణం మునుపెన్నడూ జరగలేదని అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుదారుల ఇళ్లలోకి ఎలాంటి వారెంట్ లేకుండానే, తలుపులు పగలగొట్టి వెళ్లి పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పారు.
ముఖ్యమంత్రి కార్యక్రమం ఉండటం వల్ల బంద్ కు పిలుపునిచ్చిన రేవంత్ ను అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతుండటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తాము బంద్ కు పిలుపునివ్వలేదని ఆయన తెలిపారు. బంద్ కు ఇచ్చిన పిలుపును విరమించుకున్నామని, కేవలం నిరసన కార్యక్రమాలను మాత్రమే చేపడతామని చెప్పామని అన్నారు.
రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు... మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పాలని... అది చేయకుండా బెడ్రూమ్ లోకి వెళ్లి, ఒక దొంగను తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారని జైపాల్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కు తాను ఒకటే చెబుతున్నానని... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కూతురు కవిత ఇంట్లోని బెడ్రూంలోకి నోటీసులు కూడా ఇవ్వకుండా వెళితే మీరు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.
ఇలాంటి వాటిని రాజ్యాంగం, సమాజం ఒప్పుకుంటుందా? అని నిలదీశారు. రేవంత్ ను హౌస్ అరెస్ట్ చేసి ఉండాల్సిందని అన్నారు. లేదా వారెంట్ చూపించి, తమతో రావాలని పిలవాలని చెప్పారు. ఇలాంటి దారుణాలు రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదని దుయ్యబట్టారు. ఓటమి భయంతోనే కేసీఆర్ ఇలాంటి చర్యలకు దిగుతున్నారని అన్నారు.