Revanth Reddy: ఇది తమపై జరిగిన దాడిగా ప్రజలు భావిస్తున్నారు: రేవంత్ రెడ్డి
- కావాలని చెప్పే మా నేతలపై దాడులు
- కొడంగల్ ఫ్రజలపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారు
- ఏనాడైనా కేసీఆర్ కొడంగల్ వైపు కన్నెత్తి చూశారా?
ఇది తనపై జరిగిన దాడి కాదని, ప్రజలపై జరిగిన దాడిగా భావిస్తున్నారని టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కావాలని చెప్పే తమ నేతలపై దాడులు చేయిస్తున్నారని, మహిళలపై మగ పోలీసులతో దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ ఫ్రజలపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారని, ఏనాడైనా కేసీఆర్ కొడంగల్ వైపె కన్నెత్తి చూశారా? అని ఆయన ప్రశ్నించారు.
ప్రజల అభిమానాన్ని కొనుక్కోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, ఓట్లను కొనుగోలు చేసేందుకు కేసీఆర్ రూ.200 కోట్లు ఖర్చు చేశారని, అరాచకాలు సృష్టించి కొడంగల్ లో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఒక్కో ఓటుకు ఐదు వేల రూపాయల చొప్పున టీఆర్ఎస్ పంచిపెడుతోందని, ఈ ఎన్నికల్లో అక్రమాలకు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, డీఐజీ ఇంటిలిజెన్స్ ప్రభాకర్ రావుల నంచి పరోక్షసాయం అందుతోందని ఆరోపించారు.
పోలీస్ వాహనాల్లో నగదు పంపిణీ చేసే పరిస్థితి వచ్చిందని, కేసీఆర్ చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొడతారని అన్నారు. కేసీఆర్ ముందు కొడంగల్ ప్రజల మనసులు గెలవాలని, ప్రజల్ని భయపెట్టి వారి మనసులు గెలుస్తామనుకోవడం ఆయన భ్రమ అని విమర్శించారు.