TRS: ముస్లింల కోటా పేరుతో ఓటర్లను హైజాక్ చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం: కేంద్రమంత్రి నక్వీ ధ్వజం
- ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ రాజ్యంగ విరుద్ధం
- ఈ విషయం కేసీఆర్‌కు కూడా తెలుసు
- ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ తప్పుబట్టారు. రాజ్యాంగం దీనిని అంగీకరించబోదన్నారు. ఎన్నికల్లో ఓటర్లను హైజాక్ చేసే ఉద్దేశంతోనే రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు కనిపిస్తోందన్నారు. మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని తెలిసినా కొన్ని పార్టీలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయని, ఓటర్లను హైజాక్ చేసేందుకే ఇలాంటివి ప్రకటిస్తున్నారని ఆరోపించారు.
‘‘మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని కేసీఆర్‌కే కాదు, కాంగ్రెస్‌కు కూడా తెలుసు. రాజ్యాంగం ఇందుకు అనుమతించదని కూడా వారికి తెలుసు’’ అని నక్వీ పేర్కొన్నారు. ఇటువంటి హామీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. విద్య, ఉద్యోగాల కల్పనలో ముస్లింల రిజర్వేషన్‌ను 12 శాతానికి పెంచుతూ ఇటీవల తెలంగాణ అసెంబ్లీ బిల్లు పాస్ చేసింది. దీనిని గుర్తు చేస్తూ నక్వీ ఈ వ్యాఖ్యలు చేశారు.