KCR: కేసీఆర్ ఏకాగ్రతకు అంతరాయం... కోపమొచ్చేసింది!
- ప్రసంగిస్తున్న వేళ నినాదాలు చేసిన కార్యకర్తలు
- ఆగ్రహంతో 'బేవకూఫ్' అంటూ మందలింపు
- ఈ ఉత్సాహం కొంపముంచుతుందని హెచ్చరిక
గడచిన నెలన్నరగా తెలంగాణలో విస్తృతంగా తిరుగుతూ, వరుస సభల్లో ప్రసంగిస్తున్న కేసీఆర్, ప్రసంగ సమయంలో తన ఏకాగ్రతకు ఏ మాత్రం భంగం కలిగినా అసహనాన్ని ప్రదర్శిస్తూ, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిన్న జరిగిన అలంపురం, వికారాబాద్ సభల్లో కేసీఆర్ ఆగ్రహం కనిపించింది. ఆయన మాట్లాడుతున్న వేళ, పలువురు కార్యకర్తలు నినాదాలతో గొడవ చేస్తుంటే, "లొల్లెందుకు చేస్తున్నావయ్యా? తిరుమలరెడ్డిగారూ ఎవరో ఒకరు పోండి. కూచోరాదు వయా బాబూ... ఎందుకయ్యా అల్లరి... కూర్చొండి... కూర్చొండి" అన్నారు.
ఆపై కూడా గోల తగ్గక పోవడంతో, "ఇలా అరిస్తే వేదిక దిగి పోతా. తుమ్మిళ్ల నీళ్లు బందయితయి. కామ్ గా కూసోవాలె గదా. నేనింకా ఐదారు సభలకు పోవాలె" అన్నారు. అప్పటికీ అడ్డంకులు తగులుతూ ఉండటంతో, కేసీఆర్ లో ఆగ్రహం పెరిగిపోయింది. "బేవకూఫ్ లా ఎందుకు అరుస్తున్నారు. ఈ అరుపులను ఓట్ల రూపంలో చూపండి. ఈ ఉత్సాహమే కొంపలు ముంచుతుంది" అన్నారు.
ఆపై వికారాబాద్ సభకు కేసీఆర్ వెళ్లి ప్రసంగిస్తున్న సమయంలో వాటర్ ప్యాకెట్లు తీసుకు వచ్చిన క్రేట్లను శబ్దం వచ్చేట్లు తరలిస్తుంటే కేసీఆర్ భగ్గుమన్నారు. "ప్యాకెట్లు అలా పడేశావేంటిరా సన్నాసీ" అంటూ వలంటీర్లను ఆయన మందలించారు.