Shadnagar: నోట్ల కట్టలు... జూబ్లీహిల్స్ లో రూ. 2.14 కోట్లు, షాద్ నగర్ ఈడెన్ గార్డెన్స్ లో రూ. 30 లక్షలు!
- షాద్ నగర్ లో ఓటర్లకు ప్రలోభాలు
- డబ్బు పంచుతున్నారని పోలీసులకు సమాచారం
- మెరుపుదాడి చేసిన ఎస్ఓటీ పోలీసులు
- హైదరాబాద్ నుంచి మెదక్ కు రెండు కార్లలో డబ్బు
అక్రమంగా డబ్బును తరలించి, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న వారికి పోలీసులు ఎక్కడికక్కడ చెక్ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు కూడళ్లలో పికెటింగ్ ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. షాద్ నగర్ లోని ఈడెన్ గార్డెన్ లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారం అందడంతో ఎస్ఓటీ పోలీసులు మెరుపుదాడి చేశారు. అక్కడ ఓటర్ల కోసం సిద్ధంగా ఉంచిన రూ. 30 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరు ఏ పార్టీకి చెందిన వారన్న విషయం ఇంకా వెల్లడికాలేదు.
ఇదే సమయంలో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా, రెండు కార్లలో 2.14 కోట్లు కనిపించాయి. ఈ డబ్బుకు సరైన పత్రాలను చూపించడంలో వాహనదారులు విఫలం కావడంతో, డబ్బును సీజ్ చేసి, ఐటీ శాఖకు అప్పగించారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ డబ్బును టీఆర్ఎస్ కు చెందిన ఓ నేత అనుచరులు వేర్వేరు కార్లలో మెదక్ కు తరలిస్తున్నట్టు సమాచారం.