Telangana: తెలంగాణలో కేటీఆర్ కోసం 37 చోట్ల సర్వే చేశా.. మెజారిటీ సీట్లు గెలిచేది కాంగ్రెస్ పార్టీనే! లగడపాటి రాజగోపాల్
- కేటీఆర్ నా సర్వే ఫలితాలను అంగీకరించలేదు
- క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేగా ఉన్నాయన్నారు
- బాధపడతాడేమో అని సర్దిచెప్పాను
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని 23 నియోజకవర్గాల్లో ఎన్నికలపై సర్వే నిర్వహించాల్సిందిగా తనను కోరారని పార్లమెంటు మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలిపారు. తన మిత్రుడి ద్వారా ఈ విషయాన్ని చేరవేశానన్నారు. ఇందుకోసం తాను డబ్బు, నగదు, రాజకీయ లబ్ధిని కోరుకోలేదని స్పష్టం చేశారు. తన ప్రత్యర్థులు వచ్చి సాయం కోరినా చేస్తానని ప్రకటించారు.
కేటీఆర్ కేవలం 23 స్థానాల్లో సర్వే కోరితే తాను 37 నియోజకవర్గాల్లో సర్వే చేసి నవంబర్ 11న కేటీఆర్ కు ఈ-మెయిల్ ద్వారా పంపానని వెల్లడించారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ 37 నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని తన ఆర్జీ టీమ్ సర్వేలో తేలిందని లగడపాటి పేర్కొన్నారు.
ఈ నివేదికను తాను కేటీఆర్ కు పంపగా..‘క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా ఉన్నాయి రాజగోపాల్.. డిసెంబర్ 11న ఏది నిజమో మీకే తెలుస్తుంది’ అంటూ తనకు సవాల్ విసిరారని వ్యాఖ్యానించారు. వాస్తవం చేదుగా ఉంటే తనపై కోప్పడితే ఎలాగని ప్రశ్నించారు.
కేటీఆర్ బాధపడి ఉంటారన్న అనుమానంతో.. ‘తెలంగాణ ఎన్నికల్లో మొత్తం సీట్లు ఎన్ని వస్తాయో నేను చెప్పలేను. మీరు బాగా కష్టపడుతున్నారు. మీ నాన్నగారు వాతావరణాన్ని కొంచెం పాడు చేశారు. నువ్వు ఇప్పుడు పరిస్థితి చక్కదిద్దుతున్నావు’ అని మెచ్చుకున్నట్లు గుర్తుచేసుకున్నారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ అద్భుతంగా దూసుకుపోతోందని జవాబిచ్చారని తెలిపారు.