lagadapati: లగడపాటి నిన్నే చెప్పారు.. అయిపోయింది తమ్ముళ్లూ.. మొత్తం అయిపోయింది: చంద్రబాబు
- టీఆర్ఎస్ కు నీతి, నిజాయతీ లేదు
- టీడీపీ లేకపోతే కేసీఆర్ ఎక్కడుండేవారు?
- ఓడిపోయిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికే ఫాంహౌస్ కట్టించుకున్నారు
గతంలో టీఆర్ఎస్ కు 90 సీట్లు వస్తాయని లగడపాటి రాజగోపాల్ చెబితే కేసీఆర్ ఆనందపడ్డారని...ఇప్పుడు ఓడిపోతారని చెబితే ఆయనపై మండిపడుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 'నిన్ననే లగడపాటి చెప్పారు... అయిపోయింది తమ్ముళ్లూ... మొత్తం అయిపోయింది' అంటూ కేసీఆర్ ఓడిపోతున్నారనే విధంగా వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య తరపున ఈరోజు చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాకూటమి ఘన విజయం సాధించబోతోందని అన్నారు. ఓడిపోయిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికే... కేసీఆర్ ఫాంహౌస్ కట్టించుకున్నారని ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్ పార్టీకి నీతి, నిజాయతీ లేదని చంద్రబాబు విమర్శించారు. కేసీఆర్ టీడీపీలోనే పుట్టి, టీడీపీలోనే పెరిగారని అన్నారు. టీడీపీ లేకపోతే కేసీఆర్ ఎక్కడుండేవారని ప్రశ్నించారు. పెద్ద మోదీ ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోదీ అయితే... కేసీఆర్ చిన్న మోదీ అని ఎద్దేవా చేశారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులపాలు చేశారని విమర్శించారు. తాను హైదరాబాదును కట్టలేదని, సైబరాబాదును నిర్మించానని చెప్పారు. మిషన్ భగీరథ పూర్తయ్యేంత వరకు ఓట్లు అడగనని చెప్పిన కేసీఆర్... ప్రాజెక్టును పూర్తి చేయకుండానే ఓట్లు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు.