Telangana: తెలంగాణలో మహాకూటమి గెలిస్తే ఏం చేస్తామంటే..!: క్లారిటీ ఇచ్చిన అసదుద్దీన్ ఒవైసీ!
- మేం ఎవరికీ తోక పార్టీ కాదు
- మజ్లిస్ పై కాంగ్రెస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయి
- హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన నేత
ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీ ఎవరికీ తోక కాదని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. తమ పార్టీని అణగదొక్కేందుకు, అణచివేసేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అవి ఎన్నటికీ నెరవేరబోవని వ్యాఖ్యానించారు. లగడపాటి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ మెజారిటీతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ లో చేరాల్సిన అవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
2019లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు కీలకం కానున్నాయని తెలిపారు. త్వరలోనే ఏఐఎంఐఎం మహిళా విభాగాన్ని సైతం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో ప్రస్తుతం వెలువడుతున్న సర్వేలపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని కోరారు. ఒకవేళ తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి వస్తే మద్దతు ఇస్తారా? అన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ.. ఈ విషయంలో ఇప్పుడే చెప్పలేమని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఏం చేయాలన్న విషయమై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.