chandrababu: 'మాకు డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు కడతారు సార్' అని ఒకరు కేసీఆర్ ను అడిగితే.. బేవకూఫ్ నోర్మూసుకో అన్నారు: చంద్రబాబు
- ప్రశ్నించే వారిపై కేసీఆర్ దాడి చేస్తున్నారు
- పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు
- న్నికల తర్వాత ఆపధర్మ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అవుతారు
డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టామని కేసీఆర్ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. ఏం తమ్ముళ్లూ మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? అని సభికులను ప్రశ్నించారు. ఒక సభలో ఒక వ్యక్తి మాట్లాడుతూ, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు కడతారు సార్? అని ప్రశ్నించాడని... దానికి సమాధానంగా 'బేవకూఫ్ నోర్మూసుకో' అని కేసీఆర్ దారుణంగా మాట్లాడారని తెలిపారు.
ఇళ్లు నిర్మిస్తామని కేసీఆరే చెప్పారని... అడిగిన వారిపై ఆయనే దాడి చేస్తున్నారని మండిపడ్డారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఎప్పుడిస్తారని ఓ కుర్రాడు అడిగితే... అతన్ని కూడా తిట్టారని విమర్శించారు. ప్రజలపై కేసీఆర్ దాడి చేస్తున్నారని అన్నారు. ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ దాడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కోదాడ బహిరంగసభలో మాట్లాడుతూ చంద్రబాబు ఈ మేరకు వ్యాఖ్యానించారు.
ఏ ఒక్క రోజు కూడా కేసీఆర్ సెక్రటేరియట్ కు వెళ్లలేదని, క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి వెళ్లలేదని... ఇప్పుడు మాత్రం ఓట్ల కోసం హెలికాప్టర్ వేసుకుని, చక్కర్లు కొడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘం కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళ్లాలని అన్నారు. ఎన్నికల తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. మహాకూటమి అధికారంలోకి వచ్చాక... రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందామని తెలిపారు.