Rahul Gandhi: ప్రజాకూటమి సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై రాహుల్ స్పందన!
- రైతులను మోదీ, కేసీఆర్ లు భారంగా భావిస్తున్నారు
- రైతులను తాము సంరక్షిస్తాం
- కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై చర్చిస్తాం
రైతుల సమస్యలు కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాదని, ఇది జాతీయ సమస్య అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని రెండు అత్యంత కీలకమైన సమస్యల్లో ఇది ఒకటని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్, ఢిల్లీలో మోదీలు రైతులను భారంగా భావిస్తున్నారని... తాము మాత్రం రైతులను ఆస్తిగా భావిస్తున్నామని తెలిపారు.
రైతులను గౌరవంగా చూడాలని చెప్పారు. 15 మంది స్నేహితులకు చెందిన 3.50 లక్షల కోట్ల అప్పును మోదీ తీర్చేశారని... దేశంలోని రైతుల అప్పులను ఎందుకు తీర్చడం లేదని ప్రధానిని తాను ప్రశ్నిస్తున్నానని అన్నారు. తాము రైతులను సంరక్షిస్తామని తెలిపారు. తాజ్ కృష్ణలో జరిగిన ప్రజాకూటమి సమావేశంలో జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పడం తొందరపాటు అవుతుందని రాహుల్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిన కేసీఆర్ ను ఓడించడమే తమ ప్రథమ లక్ష్యమని చెప్పారు. ప్రజాకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం ఎవరనే విషయంపై చర్చిస్తామని తెలిపారు.