Rahul Gandhi: ఇవన్నీ కేసీఆర్ ఎన్నికల గిమ్మిక్కులే: రాహుల్
- కేసీఆర్ లో అభద్రతాభావం కొట్టొచ్చినట్టు కనపడుతోంది
- సభకు వచ్చిన వారిపై కూడా ఆయన మండిపడుతున్నారు
- టీడీపీతో కలసి పని చేసేందుకు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు
కేసీఆర్ లో అభద్రతాభావం కొట్టొచ్చినట్టు కనపడుతోందని... ఆయన ప్రసంగాలను చూస్తే ఆ విషయం మనకు అర్థమవుతుందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. పలు సందర్భాల్లో ఆయన నియంత్రణ కోల్పోయారని... సభలకు వచ్చినవారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాన్ని కేసీఆర్ చేస్తున్నారని... ఇవన్నీ ఆయన ఎన్నికల గిమ్మిక్కులేనని చెప్పారు.
రోజుల వ్యవధిలోనే ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోబోతున్నారని అన్నారు. తమ ఆధ్వర్యంలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వాన్ని నడిపించేది ప్రజలేనని... రాష్ట్రం కోసం త్యాగాలకు పాల్పడినవారి స్ఫూర్తితో ప్రభుత్వం నడుస్తుందని చెప్పారు. తాజ్ కృష్ణలో మహాకూటమి నిర్వహించిన సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
టీడీపీతో కలసి పనిచేసేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని... కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందని రాహుల్ అన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, దేశం మొత్తాన్ని మోదీ, అమిత్ షాలు ట్యాప్ చేస్తున్నారని తనతో చంద్రబాబు తొలిసారి భేటీ అయినప్పుడు చెప్పారని... దేశాన్ని రక్షించడం కోసమే భావసారూప్యత కలిగినవారంతా చేతులు కలుపుతున్నామని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు కలసి పని చేయడంలో ఎలాంటి సమస్యలు ఉండబోవని చెప్పారు.