Telangana: తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 32,815 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
- హైదరాబాద్ లో అత్యధికంగా 3,873
- వనపర్తి జిల్లాలో అత్యల్పంగా 280 పోలింగ్ కేంద్రాలు
- ఎన్నికల విధుల నిమిత్తం 1,60,509 మంది సిబ్బంది
ఈ నెల 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. హైదరాబాద్ లో అత్యధికంగా 3,873, వనపర్తి జిల్లాలో అత్యల్పంగా 280 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
ఇక ఎన్నికల విధుల నిమిత్తం 1,60,509 మంది సిబ్బందిని, 649 మంది సహాయక రిటర్నింగ్ అధికారులను కేటాయించారు. దివ్యాంగ ఓటర్ల కోసం 31 జిల్లాల్లో 29,541 మంది వాలంటీర్లను అందుబాటులో ఉంచారు. ఈ నెల 7న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మకమైన 13 నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 2,80,64,684 మంది ఓటర్లు ఉన్నారు.
ఈ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు 1,821
తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికల్లో మొత్తం 1,821 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు ఈసీ పేర్కొంది. మల్కాజ్ గిరిలో అత్యధికంగా 42 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా, నిజామాబాద్ జిల్లా బాన్స్ వాడలో అత్యల్పంగా ఆరుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 15 మంది అభ్యర్థులకు పైగా పోటీ చేస్తున్న నియోజకవర్గాల సంఖ్య 25 కాగా, 16 నుంచి 31 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నియోజకవర్గాల సంఖ్య 78. ఇక 32 మంది అభ్యర్థులకు పైగా పోటీ చేస్తున్న నియోజకవర్గాల సంఖ్య 16 అని ఈసీ స్పష్టం చేసింది.