Vijaya bank: బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ.. 21, 26న బ్యాంకుల దేశవ్యాప్త సమ్మె!
- మూడు బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తున్న సిబ్బంది
- సమ్మెలో ప్రభుత్వ రంగ బ్యాంకుల యూనియన్లు
- బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించే అవకాశం
విజయా బ్యాంకు, దేనా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతిపాదిత విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే డిసెంబరు 26న సమ్మె తలపెట్టినట్టు బ్యాంకు యూనియన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అదనంగా ఈ నెల 21న కూడా సమ్మె చేయనున్నట్టు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ నేడు ప్రకటించింది. దీంతో బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించే అవకాశం వుంది.
దీంతో ఈ నెల 21 నుంచి 26 వరకూ ఒక్క 24 మినహా బ్యాంకులు పనిచేయకపోవచ్చు. దీనికి కారణం 22, 23 శని, ఆదివారాలు కాగా 25 క్రిస్మస్ కారణంగా బ్యాంకులకు సెలవు. ప్రభుత్వ రంగ బ్యాంకుల యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొననున్నాయి. స్కేల్ 4, ఆపై ఉద్యోగుల వేతనాల విషయంలో ఇండియన్ బ్యాంకు అసోసియేషన్(ఐబీఏ) వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ సమ్మె చేయనున్నట్లు ఏఐబీఓసీ నోటీసులు విడుదల చేసింది.