Sabarimala: అయ్యప్ప స్వాములకు ఏపీ ఆరోగ్య శాఖ హెచ్చరికలు!
- కేరళలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ
- దగ్గు, జలుబు, గొంతునొప్పి ఉంటే ప్రయాణం వాయిదా వేసుకోండి
- తగు జాగ్రత్తలు తీసుకున్నాకే వెళ్లిరావాలని సలహా
మండలం రోజులు మాలధారణ చేసి, శబరిమలకు వెళ్లి అయ్యప్పను దర్శించుకుని వచ్చే స్వాములకు ఏపీ ప్రజారోగ్య శాఖ కొన్ని హెచ్చరికలు చేసింది. కేరళలో స్వైన్ ఫ్లూ అధికంగా ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ, లక్షలాది మంది భక్తులు వెళ్లే శబరిమలలో స్వైన్ ఫ్లూ వైరస్ త్వరగా వ్యాపిస్తోందని, భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.
ఎవరికైనా జ్వరం, దగ్గు, గొంతునొప్పి ఉంటే, అవి తగ్గే వరకూ శబరిమలకు వెళ్లవద్దని, ఈ విషయంలో పునరాలోచించుకుని, అవి తగ్గిన తరువాత ప్రయాణం పెట్టుకోవాలని సూచించింది. ఒకవేళ ప్రయాణంలో ఈ లక్షణాలు కనిపిస్తే, కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో చికిత్స చేయించుకోవాలని సలహా ఇచ్చింది. బీపీ, షుగర్, గుండె జబ్బులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్న భక్తులు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ, ప్రజారోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.