Petrol: గెట్ రెడీ... పెట్రోలు ధరలు పెరిగే టైమొచ్చింది!
- ఇటీవలి కాలంలో వరుసగా తగ్గుతూ వచ్చిన ధరలు
- ఎన్నికలు పూర్తికాగానే ధరలు పెంచే ఆలోచనలో కేంద్రం
- ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరుగుతున్న క్రూడాయిల్ ధర
రెండు నెలలకు ముందు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్న పెట్రోలు, డీజిల్ ధరలు, ఆపై క్రమంగా తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో, పాలకులపై ప్రజా వ్యతిరేకత పెరగకుండా చూసుకునేందుకే చమురు కంపెనీలపై ఒత్తిడి తెచ్చి, క్రమంగా ధరలను తగ్గించేలా చూశారు. దీంతో నెలన్నర వ్యవధిలోనే రూ. 10 మేరకు ధరలు తగ్గాయి. ఇక ఎన్నికలు రేపటితో ముగియనుండటంతో ఆపై తిరిగి 'పెట్రో' ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని చమురు రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ యూపీ, మణిపూర్ లో ఎన్నికలు జరిగిన వేళ, జనవరి 16 నుంచి ఏప్రిల్ 1 మధ్య పెట్రోలు ధరలు దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ఆపై కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వేళ, చమురు కంపెనీలు 20 రోజుల పాటు ధరలను సవరించలేదన్న సంగతి తెలిసిందే. ఆపై కేవలం 17 రోజుల వ్యవధిలోనే రూ. 4 మేరకు ధరను పెంచాయి. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
ఇదే సమయంలో మరో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సమయం దగ్గర పడగా, కేంద్రం ఎక్సైజ్ సుంకాలను రూ. 1.50 మేరకు తగ్గించింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుతూ వస్తుండటం చమురు కంపెనీలపై ఒత్తిడిని తొగించగా, వరుసగా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుతూ వచ్చాయి. ఇటీవల క్రూడాయిల్ ధరల స్థిరీకరణపై దృష్టిని సారించిన ఒపెక్, ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించింది. దీంతో ముడిచమురు ధరలు పెరుగుతున్నా, ఇండియాలో మాత్రం ధరల సవరణ తెరపైకి రాలేదు.
శుక్రవారంతో ఎన్నికలు ముగియనుండగా, ఆ తరువాత, ధరలను సవరించుకునేందుకు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు అనుమతులు వెళ్లినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. నవంబర్ లో జీఎస్టీ కలెక్షన్లు తగ్గడం, ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యం రూ. 6.24 లక్షల కోట్లను ఇప్పటికే చేరుకోవడంతో, పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం ద్వారా కొంతైనా ఖజానాకు డబ్బు చేర్చాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదే సమయంలో ఇటీవల తగ్గించిన ఎక్సైజ్ సుంకం రూ. 1.50ను తిరిగి చేర్చితే, ఏడాదికి మార్చి నాటికి రూ. 7 వేల కోట్లను వెనకేసుకోవచ్చని కూడా కేంద్రం ఆలోచిస్తుంది. ఈ పరిణామాలను గమనిస్తుంటే, మరో రెండు రోజుల తరువాత పెట్రోలు ధరలు తిరిగి ఆకాశం బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.