KTR: లగడపాటికి రెండు రామచిలకలు పంపుతా... చిలక జోస్యం చెప్పుకోవాల్సిందే: కేటీఆర్ వ్యంగ్యం -
- లగడపాటి జోస్యాలన్నీ అవాస్తవం
- టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తు ప్రస్తావన తెచ్చిన మాట వాస్తవం
- తామే వద్దన్నామన్న కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ తనవంతు ప్రయత్నాలను సాగించిన మాట వాస్తవమేనని, అది సాధ్యపడక పోవడంతోనే ఇప్పుడు లగడపాటిని ముందు పెట్టుకుని మైండ్ గేమ్ ఆడుతోందని టీఆర్ఎస్ యువనేత కేటీఆర్ ఆరోపించారు. తెలుగుదేశం - కాంగ్రెస్ కూటమిగా ఏర్పడటంలోనూ లగడపాటే క్రియాశీలకమని వ్యాఖ్యానించిన ఆయన, చంద్రబాబు వచ్చిన తరువాత తమకు 4 శాతం ఓట్లు పెరిగాయని అన్నారు. 11వ తేదీన వెలువడే ఫలితాలతో లగడపాటికి దిమ్మ తిరిగిపోతుందని అన్నారు. ఆయనకు తాను రెండు రామచిలుకలను పంపిస్తానని, వాటితో ఆయన చిలక జోస్యం చెప్పుకోవాల్సిందేనని వ్యంగ్యంగా అన్నారు.
హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన, బావమరిది మృతదేహాన్ని ముందు పెట్టుకుని చంద్రబాబు తనవద్ద పొత్తు ప్రస్తావన తెచ్చారని, తాను అంగీకరించలేదని కేటీఆర్ అన్నారు. 20 నుంచి 22 నియోజకవర్గాలను ఎంపిక చేసి సర్వే జరిపి ఇవ్వాలని లగడపాటిని తానే కోరానని, 23 చోట్ల సర్వే చేయించిన ఆయన, 19 సీట్లు వస్తాయని చెప్పారన్నారు. ఆపై అక్టోబర్ 20 నుంచి నవంబర్ 20 మధ్య సర్వే చేయించగా, 65 నుంచి 70 సీట్లతో టీఆర్ఎస్ గెలవనుందని ఆయన చెప్పారని గుర్తు చేశారు. అంతకన్నా ఎక్కువే గెలుస్తామని తాను అన్నానని చెప్పారు. గ్రేటర్ లోని 24 సీట్లలో 17 తమవేనని, మొత్తం మీద 100 సీట్లు గెలవడం ఖాయమని తెలిపారు.