telangana elections: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై పోలీసుల గట్టి నిఘా... మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలపై దృష్టి
- పొరుగు రాష్ట్రాల నుంచి క్యాడర్ ప్రవేశించకుండా జాగ్రత్తలు
- ఎన్నికల బహిష్కరణ దృష్ట్యా మరింత అప్రమత్తం
- నాలుగు వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు
ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో శుక్రవారం పోలింగ్ సజావుగా సాగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసి వెళ్లే విధంగా భద్రత కట్టుదిట్టం చేశామని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు.
ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి మావోయిస్టు కేడర్ ప్రవేశించకుండా సరిహద్దు జిల్లాలైన మంచిర్యాల, పెద్దపల్లిలో నిఘా కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా నాలుగు వేలమంది పోలీసులతో భద్రత ఏర్పరిచామని తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద కేంద్ర బలగాల పహారా ఉంటుందని చెప్పారు.
చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలు, కాళేశ్వరం సమీపంలోని మంథని నియోజకవర్గంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సత్యనారాయణ తెలిపారు. డబ్బు, మద్యం పంపిణీ చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.