election commission: ఎన్నికల హామీల అమలుకు నిర్దిష్టమైన నిబంధనలను ఈసీ తీసుకురావాలి: వీహెచ్
- ఇచ్చిన హామీలను ఐదేళ్ల లోపు పూర్తి చేయాలి
- అలా చేయని నాయకులను పదేళ్లు ఎన్నికలకు దూరంగా ఉంచాలి
- అలా చేస్తే, నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుంటారు
ఎన్నికల్లో హామీలిచ్చి అమలు చేయని నాయకులపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని టీ-కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) అన్నారు.అంబేద్కర్ 62వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని గాంధీభవన్ లోని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఎన్నికల హామీల అమలుకు నిర్దిష్టమైన నిబంధనలను ఈసీ తీసుకురావాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను ఐదేళ్ల లోపు పూర్తి చేయని నాయకులపై ఈసీ కొరఢా ఝళిపించాలని, పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని కోరారు. అలా చేస్తే, నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని సాధ్యమయ్యే హామీలనే ఇస్తారని అన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పదవి గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఎప్పుడూ ‘రెడ్డి’ సామాజికవర్గానికేనా సీఎం పదవి? ప్రజాకూటమి అధికారంలోకి వస్తే, బలహీనవర్గాలకు చెందిన వ్యక్తే సీఎం కావాలని వీహెచ్ అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎం అవుతారని చెప్పడానికి గులాంనబీ ఆజాద్ ఎవరు? అని ప్రశ్నించిన వీహెచ్, సర్వే సత్యనారాయణ తనను తాను సీఎం అభ్యర్థిగా ప్రకటించుకోవడాన్ని ప్రస్తావించారు. గతంలో తనకు సీఎం పదవి నోటి దాకా వచ్చి పోయిందని అన్నారు.