Telangana: రహస్య బ్యాలెట్ స్ఫూర్తికి అనుగుణంగా ఓటర్లు నడుచుకోవాలి: రజత్ కుమార్
- ఓటు వినియోగదారులు గోప్యత పాటించాలి
- పోలింగ్ కేంద్రాల వద్ద అందరూ హుందాగా ప్రవర్తించాలి
- పోలింగ్ ప్రక్రియపై అనుక్షణం పర్యవేక్షిస్తుంటాం
ఓటు హక్కు వినియోగించుకునే ప్రతి ఓటరు గోప్యత పాటించాలని, రహస్య బ్యాలెట్ స్ఫూర్తికి అనుగుణంగా ఓటర్లు నడుచుకోవాలని, పోలింగ్ కేంద్రాల వద్ద అందరూ హుందాగా ప్రవర్తించాలని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ సూచించారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ఫీలు తీసుకోవడం నిషేధమని, పోలింగ్ కేంద్రాల లోపలికి సెల్ ఫోన్లను అనుమతించమని చెప్పారు.
పోలింగ్ కేంద్రాల్లో ధూమపానం చేయడంపైనా నిషేధం ఉందని, మద్యం తాగి ఏ ఒక్క ఓటరూ ఓటింగ్ కు వెళ్లకూడదని సూచించారు. ఆ విధంగా వెళ్లడం హుందాతనం కాదని, చట్టపరంగానూ దీనిపై నిషేధం ఉందని, పోలింగ్ ప్రక్రియపై అనుక్షణం పర్యవేక్షిస్తుంటామని, కమాండ్ కంట్రోల్ కేంద్రంలో అందుకోసం ఏర్పాట్లు ఉన్నాయని స్పష్టం చేశారు.