paja gayakudu: డెబ్బై ఏళ్ల వయసులో నేను తొలిసారిగా ఓటు వేయబోతున్నా: ప్రజా గాయకుడు గద్దర్
- డెబ్బై ఏళ్ల తర్వాత నా ఓటును రిజిష్టర్ చేసుకున్నా
- నాడు ‘ఓటు’ ఎందుకు వేయాలని నేను ప్రశ్నించా
- ఆ పరిస్థితి నుంచి విముక్తి పొందాల్సిన సమయమొచ్చింది
ప్రజాగాయకుడు గద్దర్ తొలిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. డెబ్బై ఏళ్ల వయసులో తాను తొలిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నట్టు చెప్పారు. మెదక్ జిల్లా తూప్రాన్ లోని తన తల్లిదండ్రుల సమాధి వద్ద ఆయన నివాళులర్పించారు.
అనంతరం, తనను కలిసిన విలేకరులతో గద్దర్ మాట్లాడుతూ, డెబ్బై ఏళ్ల తర్వాత తన ఓటును రిజిష్టర్ చేసుకున్నానని అన్నారు. ఎన్నికల ద్వారా పేదవాడికి ఏం ప్రయోజనం కలిగిందని, ‘ఓటు’ ఎందుకు వేయాలని గతంలో తాను ప్రశ్నించానని, అయితే, ఆ పరిస్థితి నుంచి విముక్తి పొందాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఒకే మనిషికి.. ఒకే ఓటు, ఒకే విలువ ఉందని, రాజుకైనా ఒకే ఓటు, కూలోడికైనా ఒకే ఓటు అని అన్నారు. ‘ప్రజలారా, ఓట్ల చైతన్యం తీసుకురండి, ఓటు హక్కును వినియోగించుకోండి’ అని పిలుపు నిచ్చారు.