KCR: ప్రముఖుల్లో ఎవరెవరు ఎక్కడి నుంచి ఓటేస్తారంటే..!
- చింతమడకలో కేసీఆర్.. సిద్దిపేటలో హరీశ్ రావు
- కోదాడలో ఉత్తమ్.. జగిత్యాలలో ఎల్. రమణ
- జీవితంలో తొలిసారి ఓటు వేయనున్న గద్దర్
తెలంగాణలో మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సారి ఎన్నికల్లో సరికొత్తగా వీవీపాట్ యంత్రాలను వినియోగిస్తున్నారు. దీనివల్ల ఓటరు తాను వేసిన వ్యక్తికే తన ఓటు పడిందీ లేనిదీ తెలుసుకునే వీలుంది. ఇక ఈ ఎన్నికల బరిలో ఉన్న ప్రముఖులు తమ ఓటు ఎక్కడ వేయబోతున్నారంటే..
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని చింతమడకలో తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మరో నేత హరీశ్ రావు సిద్దిపేట బూత్ నంబరు 107లో ఓటు వేయబోతున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబరు 2లోని సెయింట్ నిజామిస్ స్కూల్లో కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఎంపీ కవిత బోధన్ నియోజకవర్గంలోని పాతంగల్లో ఓటు వేయనున్నారు.
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడలో, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ జగిత్యాలలో, తార్నాకలో టీజేఎస్ చీఫ్ కోదండరాం, చిక్కడపల్లిలో లక్ష్మణ్, రాజేంద్రనగర్లోని వట్టేపల్లిలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్, హుస్నాబాద్ రేకొండలో చాడ వెంకటరెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అంబర్పేట ఇంద్రప్రస్థ కాలనీలో తమ్మినేని ఓటు వేయనుండగా, గద్దర్ తొలిసారిగా మల్కాజిగిరిలో వేయనున్నారు.