Telangana: స్టేషన్‌ఘన్‌పూర్‌లోని శివునిపల్లిలో ప్రారంభం కాని పోలింగ్.. ఎల్బీనగర్లో ఓటర్ల ఆందోళన
- రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన పోలింగ్
- కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
- ఇబ్బందులకు గురిచేస్తున్న ఈవీఎంలు
తెలంగాణ వ్యాప్తంగా ఈ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ఎన్నికల అధికారులు పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు బారులు తీరారు. మరోవైపు, ఎన్నికల అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈవీఎంల సమస్య కనిపిస్తోంది.
రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో ఈవీఎంల సమస్య తలెత్తింది. జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మొదటి వార్డులో ఈవీఎంలు మొరాయించాయి. ఇంకోవైపు, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని శివునిపల్లిలో 8 గంటలు దాటుతున్నా పోలింగ్ ప్రారంభం కాలేదు. మరికొన్ని చోట్ల వీవీపాట్ యంత్రాలు పనిచేయడం లేదు. దీంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హయత్‌నగర్‌లో ఓటర్లు ఆందోళనకు దిగారు. కూకట్‌పల్లిలోని బూత్ నంబర్ 12లో ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు వాటి స్థానంలో కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేశారు.