Hyderabad: అలా అనుకుంటే మీకు నిలదీసే హక్కుండదు: నాగార్జున
- ఓటేస్తేనే నిలదీసే హక్కు వస్తుంది
- ఓ బాధ్యత అనుకుని ఓటేయండి
- పొద్దున్నే ఓటు వేసిన నాగార్జున
రాజకీయాలు చెడిపోయాయని, వాటికి దూరంగా ఉండాలని ఎవరైనా అనుకుంటే, వారికి సమస్యలపై నిలదీసే హక్కుండదని హీరో అక్కినేని నాగార్జున వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఇది 'ఓటర్స్ డే' అంటూ, నేడు ప్రతి ఒక్కరూ తప్పకుండా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసి వెళ్లాలని కోరారు.
నేడు ఓటు వేయడం పౌరుల బాధ్యతని అన్నారు. ఈ విషయంలో అధికారులు ఎంతగా ప్రజల్లో అవగాహన తెచ్చినా, పలువురిలో ముఖ్యంగా యువతలో రాజకీయాలపై ఓ చెడు అభిప్రాయం ఉందని, దాన్ని తొలగించుకుని ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించాలని అన్నారు. ఓటేసిన వారికే పాలకులను నిలదీసే హక్కుంటుందన్న విషయాన్ని అందరూ గ్రహించాలని కోరారు.