Police: పలు చోట్ల కాంగ్రెస్ - టీఆర్ఎస్ - బీజేపీ నేతల మధ్య ఘర్షణ!
- గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలు
- ఆఖరి క్షణాల్లో ఘర్షణలు
- చెదరగొడుతున్న పోలీసులు
ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలు పన్నిన అభ్యర్థులు, వారి అనుచరగణం ఆఖరి క్షణాల్లో ఘర్షణలకు దిగుతున్నారు. పలు చోట్ల ఈవీఎంలు సమస్యలను కల్పిస్తుండగా, ఇంకొన్ని చోట్ల అభ్యర్థుల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.
గండిపేట మండలం పుప్పులగూడా బాలాజీ నగర్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద బీజేపీ, మహాకూటమి నేతల మధ్య వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న బీజేపీ అభ్యర్థి బద్దం బాల్ రెడ్డి పోలీసులకు, ఈసీకి ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలం ఎల్లమ్మ కుంటలో టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య బాహాబాహీ జరిగింది.పోలింగ్ కేంద్రం ముందే జరిగిన ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రులకు తరలించారు.
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం ఇమామ్ నగర్ లో తమ సమస్యలు పరిష్కరించలేదని ఓటర్లు ఓటు వేసేందుకు వెళ్లకుండా రాస్తారోకోకు దిగారు. వరంగల్ రూరల్ ఖానాపూర్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ, తోపులాట చోటు చేసుకోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.