Rajasthan: సరదాగానే అన్నా...వేరే ఉద్దేశం లేదు : వసుంధర రాజేపై వ్యాఖ్యలకు శరద్‌యాదవ్ వివరణ
- ఆమె కుటుంబంతో నాకు మంచి సంబంధాలున్నాయి
- శరద్ మాటలు చాలాఅవమానకరమన్న వసుంధర
- వసుంధర వ్యాఖ్యలపై సచిన్ పైలట్ ప్రతి విమర్శలు
రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై నోరుపారేసుకున్న జేడీయూ బహిష్కృత నేత శరద్‌యాదవ్ తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకున్నారు. 'వసుంధరకు కొంత విశ్రాంతి ఇవ్వండి...ఆమె అలసిపోయారు. ఇదివరకు సన్నంగా ఉండే ఆమె ఈమధ్య బాగా లావయ్యారు’ అంటూ శరద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దుమారం లేపడంతో నష్టనివారణకు యాదవ్ ప్రయత్నించారు.
తాను సరదాగానే అలా వ్యాఖ్యానించానని, అందులో వేరే ఉద్దేశంగాని, ఎవరినీ బాధపెట్టాలని గాని లేదని తెలిపారు. వసుంధరరాజే కుటుంబంతో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పుకొచ్చారు. కాగా శరద్‌యాదవ్ వ్యాఖ్యలపై వసుంధర రాజే సింధియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఇలా వ్యాఖ్యానించడం వల్ల తనకు దారుణ అవమానం జరిగిందని భావిస్తున్నట్లు తెలిపారు.
అయితే వసుంధర వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ వ్యంగ్య విమర్శనాస్త్రాలు సంధించారు. వసుంధర పాలనలో రాజస్థాన్ మహిళలు అంతకంటే ఎక్కువ అవమానాలు, వేధింపులు ఎదుర్కొన్నారని విమర్శించారు. అత్యధిక నేరాలు జరుగుతున్న రాష్ట్రాల్లో రాజస్థాన్ రెండో స్థానానికి చేరడమే ఇందుకు నిదర్శనమన్నారు.