muslim: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్.. రిజర్వేషన్ల శాతం పెంచాలన్న పిటిషన్ తిరస్కరణ!
- రిజర్వేషన్ల పెంపు పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదంటూ తీర్పు
- తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వాదనలను పట్టించుకోని సుప్రీం
రిజర్వేషన్లను పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదిస్తూ... రాష్ట్రంలో బీసీల జనాభా అధికంగా ఉందని, ఈ ప్రత్యేక పరిస్థితుల కారణంగా ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్లను పెంచాల్సి ఉందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 67 శాతం ఇవ్వాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం... రిజర్వేషన్లను పెంచడం కుదరదని, రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని తీర్పును వెలువరించింది.