Telangana: టీఆర్ఎస్ గెలుపు పక్కా.. తేల్చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్
- గ్రామీణ ఓటర్ల మద్దతు టీఆర్ఎస్కే
- దళితుల్లో కొంత అసంతృప్తి ఉంది
- అభ్యర్థులు పెద్ద మైనస్
తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం తథ్యమని ప్రొఫెసర్ నాగేశ్వర్ తేల్చి చెప్పారు. ఆ పార్టీ 70 సీట్లు గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. ప్రజాకూటమి గెలుస్తుందని అందరూ చెబుతున్నా, అండర్ కరెంట్లా ఓట్లన్నీ టీఆర్ఎస్కే పడ్డాయని, ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని స్పష్టం చేశారు. టీఆర్ఎస్కు పూర్తిగా అనుకూల వాతావరణం ఉందని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్దతు ఇప్పటికీ ఉందన్న నాగేశ్వర్.. కేసీఆర్కు మరో ఐదేళ్లు అధికారం ఇవ్వాలని భావించారన్నారు. అభ్యర్థుల పనితీరుబట్టి కాకుండా కేసీఆర్ ముఖం చూసే చాలామంది టీఆర్ఎస్కు ఓటు వేశారన్నారు. అలాగే, ఏపీ సీఎం చంద్రబాబునాయుడును టార్గెట్ చేయడం కూడా టీఆర్ఎస్కు కలిసొచ్చిందన్నారు.
కేసీఆర్ పథకాలు కూడా ఆయనకు మేలు చేశాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీపై మొత్తంగా వ్యతిరేకత లేదన్న నాగేశ్వర్.. దళిత వర్గాల్లో కొంతమేర అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనన్నారు. అయితే, టీఆర్ఎస్కు అతిపెద్ద డ్యామేజ్ మాత్రం అభ్యర్థులేనని కుండబద్దలుగొట్టారు. వాళ్లను చూసి కనుక ప్రజలు ఓటేసి ఉంటే టీఆర్ఎస్ పరిస్థితి మరోలా ఉండేదన్నారు.
తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రుల ఓట్లు మొత్తం టీడీపీకి పడవని, ఎందుకంటే వారిలో అందరూ టీడీపీ అనుకూల వర్గమే ఉండరని వివరించారు. వీరిలో జగన్ వర్గం కూడా ఉంటారని అందరూ గంపగుత్తగా టీడీపీకే ఓటేశారని భావించకూడదన్నారు. జగన్ అభిమానులు టీఆర్ఎస్కే ఓటు వేసి ఉంటారని నాగేశ్వరరావు విశ్లేషించారు. నిజానికి టీఆర్ఎస్ 90 సీట్ల వరకు గెలవాల్సి ఉన్నా అంచనాలన్నీ 70 సీట్లు మాత్రమే గెలుస్తాయని చెప్పడాన్ని చూస్తే ప్రభుత్వంపై అసంతృప్తి ఉందన్న విషయం నిజమేనని నాగేశ్వర్ వివరించారు.