Rajat Kumar: నన్ను క్షమించండి... ఇకపై ఇలా జరుగకుండా చూస్తాం: తెలంగాణ ఓటర్లతో రజత్ కుమార్
- నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్పారు
- మూడేళ్ల క్రితం పొరపాట్లు జరిగాయి
- మరోసారి ఇలా జరుగకుండా చూసుకుంటామన్న రజత్ కుమార్
తెలంగాణకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓట్లు గల్లంతయ్యాయని వేలమంది ఫిర్యాదు చేయడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పందించారు. తమ ఓట్లు పోయాయని చాలా మంది స్వయంగా తనకు ఫోన్ చేశారని చెప్పిన ఆయన, ఓటర్లకు క్షమాపణలు చెప్పారు. మూడేళ్ల క్రితం జరిగిన ఐఆర్ఈఆర్ లో పొరపాట్లు జరిగాయని, అప్పట్లో నిబంధనలు పాటించకుండా ఓట్లను తొలగించడంతోనే ఈ సమస్య వచ్చిందని అన్నారు.
జాబితాలో ఓట్లు ఉన్నాయో లేదో చూసుకోవాలని ప్రచారోద్యమం చేశామని గుర్తు చేసిన ఆయన, రెండు నెలల్లో 25 లక్షల మంది కొత్త ఓటర్లను చేర్చామని అన్నారు. ఓట్లను కోల్పోయిన వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని, 26 నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఉంటుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను లోక్ సభ ఎన్నికల్లో జరుగకుండా చూస్తామని చెప్పారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై 4,292 ఫిర్యాదులు అందాయని, వాటన్నింటినీ పరిష్కరించామని రజత్ కుమార్ తెలిపారు.