Lagadapati: గజ్వేల్ పోలీసులు చెప్పినట్టుగా 'ఆయన' ఓడిపోతారా?: లగడపాటి సమాధానం ఇది
- గజ్వేల్ పోలీసులు చెప్పారన్న లగడపాటి
- ఫలితాన్ని మీ ఊహకే వదిలేస్తున్నానని తాజా వ్యాఖ్య
- అది జరిగి మూడు నెలలైందని వెల్లడి
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రజా కూటమి తరఫున వంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ పడ్డ గజ్వేల్ నియోజకవర్గంపై ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొనివుంది. ఆంధ్రా ఆక్టోపస్ గా పేరున్న లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. తాను గజ్వేల్ లో పర్యటిస్తున్న వేళ, తన కారును ఆపిన కొందరు పోలీసులను అక్కడి రాజకీయ పరిస్థితులపై అడిగానని 'ఆయన ఓడి పోతారు సార్' అని ఏడుగురు పోలీసులు చెప్పారని నాలుగు రోజుల క్రితం లగడపాటి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయమై నిన్నటి సమావేశంలో లగడపాటిని మీడియా ప్రశ్నించింది.
వ్యక్తిగత విజయావకాశాలను గురించి తాను వెల్లడించబోనని చెప్పిన లగడపాటి, గజ్వేల్ లో ఫలితాన్ని మీ ఊహకే వదిలేస్తున్నానని అన్నారు. కేసీఆర్ ఓడిపోతారా? అని ప్రశ్నించగా, తాను ఎన్నడూ ఆ మాట అనలేదని తప్పించుకున్నారు. గజ్వేల్ లో కానిస్టేబుళ్లు చెప్పిన జోస్యం నిజమవుతుందా? అన్న ప్రశ్నకు... ఆ ఘటన జరిగి మూడు నెలలైందని, ఆపై చాలా పరిణామాలు జరిగాయని అన్నారు. కాగా, గజ్వేల్ లో 88 శాతం పోలింగ్ నమోదు కావడంతో వ్యతిరేక ఓటు తమకు అనుకూలమని ప్రజాకూటమి, కేసీఆర్ పై అభిమానంతో ఓటర్లు భారీగా తరలివచ్చారని టీఆర్ఎస్ వర్గాలు భరోసాగా ఉన్నాయి. ఫలితం తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.