anna canteens: నియోజకవర్గానికో 'అన్న క్యాంటీన్'... మేజర్ పంచాయతీల్లో ఏర్పాటుకు ఏపీ సర్కారు యోచన
- నగర, పట్టణాల్లో క్యాంటీన్లకు ఆదరణ బాగుండడంతో ఈ నిర్ణయం
- తొలివిడత 112 కేంద్రాల్లో ఏర్పాటుకు అవకాశం
- నియోజకవర్గం, మండల కేంద్రాలు, సెమీ అర్బన్ ప్రాంతాలకు ప్రాధాన్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లకు ఆదరణ బాగుండడం, సర్కారుకు పేరు తెచ్చిపెట్టడంతో వాటిని విస్తరించాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి కనీసం ఒక్క క్యాంటీన్ అయినా ఉండేలా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం నియోజకవర్గం, మండల కేంద్రాలు, సెమీ అర్బన్ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తూ స్థలాలు ఎంపిక చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ నుంచి ఆదేశాలు జారీ కావడంతో స్థలాల వేటలో అధికారులు పడ్డారు. ప్రభుత్వ చర్యలు కార్యాచరణలోకి వస్తే 112 మేజర్ పంచాయతీల్లో క్యాంటీన్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
క్వారీలు, మైనింగ్, ఇసుక జిన్నింగ్, స్పిన్నింగ్, ఇతర పరిశ్రమలు ఉండే ప్రాంతాల్లో క్యాంటీన్లు ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో జిల్లాలోని మేజరు పంచాయతీల ఈఓలు, పంచాయతీల ప్రత్యేక అధికారులు, డీఎల్పీఓలు ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీ, రెవెన్యూ, ప్రభుత్వ స్థలాల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. ఖాళీగా ఉన్న స్థలాల సర్వే నంబర్లు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ బారిలో ఉన్నట్లు బయటపడుతుండడం విశేషం.