rajamundry: ఎంపీ మురళీమోహన్ది మంచి ఆలోచన... ఆందరూ ఫాలో కావాలి: సీఎం చంద్రబాబు
- మొబైల్ క్యాన్సర్ వాహనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి
- తన ఎంపీ నిధులతో దీన్ని రూపొందించిన మురళీమోహన్
- చంద్రన్న సంచార చికిత్సతో గ్రామాల్లో సేవలకు వినియోగం
తన ఎంపీ నిధులను సద్వినియోగం చేయడంలో రాజమండ్రి లోక్సభ సభ్యుడు మాగంటి మురళీమోహన్ మంచి ఆలోచన చేశారని, మిగిలిన ఎంపీలు కూడా ఆయనను అనుసరించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. మురళీమోహన్ తన పార్లమెంటరీ నియోజకవర్గం నిధులతో రూపొందించిన మొబైల్ క్యాన్సర్ వాహనాన్ని సీఎం శనివారం ఉదయం అమరావతిలో ప్రారంభించారు. చంద్రన్న సంచార చికిత్స పేరుతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు ఈ వాహనం ద్వారా వైద్య సేవలు అందించనున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ అంబులెన్స్ ద్వారా పల్లెల్లోని రోగులకు పూర్తి స్థాయి వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. మురళీమోహన్ మాట్లాడుతూ ఈ సంచార వాహనాన్ని మండల కేంద్రంలో అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. అవసరమైన రోగులు వస్తే వాహనంలోనే వైద్యులు చికిత్స అందించి సూచనలు చేస్తారని తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలో ఇటువంటి వాహనాన్ని ఏర్పాటుచేసి క్యాన్సర్ నివారణకు కృషి చేయాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు.