Telangana: కేసీఆర్.. ప్రగతిభవన్ విడిచిపెట్టడానికి కూడా ముహూర్తం పెట్టుకో!: కాంగ్రెస్ నేత కుసుమకుమార్ విసుర్లు
- తెలంగాణలో 65-80 స్థానాలు సాధిస్తాం
- అసహనంతోనే మా నేతలపై దాడులు
- గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన నేత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాకూటమి 65-80 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి రాబోతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ జోస్యం చెప్పారు. తెలంగాణ ఎన్నికలపై జాతీయ మీడియా సరిగ్గా అంచనా వేయలేకపోయిందనీ, ప్రజల నాడిని పసిగట్టలేకపోయిందని వ్యాఖ్యానించారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటితో పాటు మధుయాష్కీ, వంశీచంద్ రెడ్డిపై అసహనంతోనే టీఆర్ఎస్ నేతలు దాడులకు దిగారని విమర్శించారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ నెల 11న ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యేవరకూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని కుసుమకుమార్ సూచించారు. కేసీఆర్ వంటి నియంతను గద్దె దించాలని తెలంగాణ ప్రజలు బలంగా కోరుకుంటున్నారనీ, తమకు అందిన నివేదికల్లో ఇదే తేలిందన్నారు. తాము మేనిఫెస్టోలో ప్రకటించిన నిరుద్యోగ భృతి, ఇంటికి రూ.5 లక్షలు, సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత మహాకూటమి(ప్రజాకూటమి)కి కలిసి వచ్చాయన్నారు.
ప్రతీదానికి ముహూర్తాలు చూసుకునే కేసీఆర్ ప్రగతి భవన్ ను విడిచిపెట్టడానికి కూడా ముహూర్తం చూసుకుంటే మంచిదని చురక అంటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తామని హామీ ఇచ్చామనీ, దాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. తొలి ఏడాదే 20,000 టీచర్ ఉద్యోగాలతో మెగా డీఎస్సీని నిర్వహిస్తామన్నారు.