lagadapati: సర్వేల సన్యాసం తీసుకునేందుకు లగడపాటి సిద్ధంగా ఉండాలి: కేటీఆర్
- తెలంగాణ రాష్ట్రం రాదని లగడపాటి చెబితే ఆగిందా?
- లగడపాటి సర్వే వివరాలు నేనూ విన్నా
- ఏం చెప్పాడో ఆయనకే అర్థమైఉండదు
తెలంగాణ రాష్ట్రం రాదని లగడపాటి రాజగోపాల్ చెబితే ఆగిందా? ఇప్పటికే రాజకీయ సన్యాసం తీసుకున్న ఆయన, ఇక, సర్వేల సన్యాసం తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ అగ్ర నేత కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిన్న లగడపాటి తన సర్వే వివరాలు చెబుతుంటే తాను కూడా చూశానని, అసలు, ఆయన ఏం చెప్పాడో ఆయనకు కూడా అర్థమై ఉండదని సెటైర్లు విసిరారు. మొన్న చెప్పిందే అటూఇటూ చేసి నిన్న అదే చెప్పాడని, అదే సోది చెప్పాడని విమర్శించారు. తెలంగాణ దెబ్బకు లగడపాటి ఇది వరకే రాజకీయ సన్యాసం తీసుకోవడం అయిపోయింది. ఇక, సర్వేల సన్యాసం కూడా ఆయన తీసుకోవడం ఖాయమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ప్రత్యర్థులు తమపై ఎన్ని కూటములు కట్టినా, కుట్రలు చేసినా, ఎన్నిరకాల గారడీలు చేసినప్పటికీ ప్రజలు వాటిని పట్టించుకోకుండా, వారి చైతన్యాన్ని ప్రదర్శించారని అన్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకూ, చివరి ఓటు లెక్క పెట్టే వరకూ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.. అందరమూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలుగా చెప్పుకునే వారి అంచనాలు, కలలు కల్లలు కాబోతున్నాయని, ప్రజలు ఏకపక్షమైన తీర్పు ఇవ్వబోతున్నారని కేటీఆర్ అన్నారు.