Devoleena Bhattacharji: వజ్రాల వ్యాపారి హత్య కేసులో ప్రముఖ టీవీ నటి.. పోలీసుల ఇంటరాగేషన్
- రాజేశ్వర్ కిశోరీలాల్ ఉదానీ హత్య కేసులో దేవలీనా పాత్రపై అనుమానం
- అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు
- వ్యాపారి ఇంటికి చివరిసారి వెళ్లింది ఆమెనే
హిందీ టీవీ సీరియల్ నటి దేవలీనా భట్టాచార్జీ ఓ హత్య కేసులో చిక్కుకుంది. ముంబైకి చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి రాజేశ్వర్ కిశోరీలాల్ ఉదానీ హత్య కేసులో ఆమె పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్న పోలీసులు శనివారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. క్రైం బ్రాంచ్ పోలీసులు ఆమెను ఇంటరాగేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
కిశోరీలాల్ హత్యకు గురికావడానికి ముందు ఆయన ఇంటికి చివరిసారిగా వెళ్లింది దేవలీనాయేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. వ్యాపారితో ఆమెకు పరిచయాలు కూడా ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. బంద్రాలోని ఆమె నివాసం నుంచి శనివారం ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు దేవలీనాను అరెస్ట్ చేయలేదని, అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని తెలిపారు.
తెలుగు టీవీ ప్రేక్షకులకు దేవలీనా సుపరిచితురాలే. ‘డాన్స్ ఇండియా డాన్స్’షోతో టెలివిజన్‌కు పరిచయమైన ఈ బెంగాలీ నటికి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. తెలుగులో ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ పేరుతో ప్రసారం అవుతున్న సీరియల్‌లో ఆమెదే టైటిల్ రోల్. టీవీల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న మహిళల్లో దేవలీనా మొదటి స్థానంలో ఉంది.