Andhra Pradesh: దుర్గగుడిలో కొత్త డ్రెస్ కోడ్.. జీన్స్, స్లీవ్ లెస్ షర్టులకు నో ఎంట్రీ!
- కీలక నిర్ణయం తీసుకున్న ఈవో కోటేశ్వరమ్మ
- 2019, జనవరి 1 నుంచి అమలుకు నిర్ణయం
- ప్రత్యేక చీరలను విక్రయించేందుకు కౌంటర్లు
విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం అధికారులు డ్రెస్ కోడ్ ను విధించారు. ఇకపై ఇష్టానుసారం కాకుండా పద్ధతిగా ఉండే దుస్తులను వేసుకుని వస్తేనే భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. కొత్త నిబంధనల మేరకు లంగాజాకెట్, లంగాఓణీ, పంజాబీ డ్రెస్, చుడీదార్ ధరించిన మహిళలనే ఆలయంలోకి అనుమతిస్తారు. అలాగే చిరుగులు లేని, నిండు ప్యాంట్లతో వచ్చే పురుషులనే ఆలయంలోకి రానిస్తారు.
ఆలయ ఈవో కోటేశ్వరమ్మ ప్రతిపాదించిన ఈ మార్పులకు ఆలయ పాలక మండలి ఇప్పటికే ఆమోదం తెలిపింది. తాజాగా ఈ విషయాన్ని వైదిక కమిటీకి సైతం నివేదించనున్నారు. ఈ విషయమై ఆలయ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. జీన్స్, షాట్స్, టీ షర్టులు, స్లీవ్‌లెస్ షర్టులు ధరించే మహిళలను ఆలయంలోకి అనుమతించబోమని వెల్లడించారు. షాట్స్, సగం ప్యాంట్లు ధరించి ఆలయానికి వచ్చే పురుషులకు సైతం ఇదే నిబంధన వర్తిస్తుందన్నారు.
అమ్మ శారీస్ పేరిట చీరలను విక్రయించేందుకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భక్తుల కోసం కేవలం రూ.100కే ఈ చీరలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. భక్తులు దుస్తులను మార్చుకునేందుకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేస్తామన్నారు. 2019, జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయన్నారు. కాగా, డ్రెస్ కోడ్ పై భక్తులకు అవగాహన కల్పించేందుకు ఆలయ ప్రాంగణంలో ప్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.